తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మీ స్కీమ్ కింద రూ.2,500, రైతులకు రుణ మాపీ వంటి స్కీమ్ లు త్వరలోనే కొనసాగుతాయని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి, భద్రాద్రి శ్రీసీతారాములవారి, అలంపూర్ జోగులాంబ వంటి దేవుళ్ల పై ప్రమాణం చేశారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఏకకాలంలోనే రూ.2లక్షల రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడి సాక్షిగా మాట ఇచ్చాడు.. రైతుల సాక్షిగా నెరవేరుస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రూ.2లక్షల రుణమాపీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది కేబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది.