కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. రేవంత్ సర్కారులో మహిళలు అంటే ఒక చులకన భావంగా మారిందని, ఆ విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళను పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గత 8 నెలల్లో మహిళలపై 1000 పైగా లైంగికదాడులు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడని’, ఆయన తీరు మారడం లేదని విమర్శించారు.
కాగా, జైనూరులో ఆదివాసీ మహిళ మీద ఓ కమ్యూనిటికి చెందిన ఆటో డ్రైవర్ హత్యాచార యత్నం చేయగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నా దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. గొడవలు పెద్దగా అవ్వకుండా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు.