ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పార్టీ ఆఫీస్ బేరర్లు ఎవరూ ఈ ఎన్నిక ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ప్రచారం చేయదలచుకుంటే తొలుత పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ తేల్చి చెప్పింది.
ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని అదేరోజు వెల్లడించనున్న విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను శశిథరూర్ స్వాగతించారు. కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ విభాగానికి చీఫ్ పదవికి తాను గత నెలలోనే రాజీనామా చేశానని చెప్పారు.
బరిలో ఉన్న అభ్యర్థులు ఆయా రాష్ట్రాలకు ప్రచారం కోసం వస్తే పీసీసీ అధ్యక్షులు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మార్గదర్శకాల్లో హైకమాండ్ పేర్కొంది. పీసీసీ అధ్యక్షుడు తమ రాష్ట్రంలో మీటింగ్ హాలు, కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేయాలి తప్ప అభ్యర్థి గెలుపు కోసం తన వ్యక్తిగత సామర్థ్యాన్ని ఉపయోగించరాదని స్పష్టం చేసింది.