కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి వ్యతిరేకమని.. రాజ్యసభలో తాను నిన్న చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ దేశంలో అబద్దాలను వ్యాప్తి చేస్తోందన్నారు. అంబేద్కర్ ను అనుమానిస్తే.. దేశం సహించదంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు మండిపడుతున్న వేళ ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిన తీరును ఖండిస్తున్నట్టు అమిత్ షా చెప్పారు.
కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి రాజ్యాంగ వ్యతిరేక పార్టీ.. కాంగ్రెస్ ఏనాడు అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదు. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ను ఎంతో గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ నా వ్యాఖ్యలను వక్రీకరించింది. నేను ఎన్నడూ అంబేద్కర్ ని అవమానించని పార్టీ నుంచి వచ్చాను. ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డులలో ఉంది. కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చానని తెలిపారు.