రేపు కారెక్కనున్న జలగం వారసుడు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు..జలగం ప్రసాదరావు కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు. శనివారం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నట్లు ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు ని గతంలో పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ 1999లో ఆయన్ని సస్పెండ్ చేసింది.. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ మధ్య కాలంలో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అదే పార్టీకి చెందిన కొందరునేతలు అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాదరావు తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకున్నారు.
అయితే తాజాగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు శుక్రవారమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఏకే ఆంటోని.. రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందజేశారు. ఆ సమాచారం అందేలోగానే జలగం ప్రసాద రావు తెరాసలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిని కాంగ్రెస్ కోల్పోయింది. ఊహించని షాక్ తో కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో పాటు, గతంలో మంత్రి గా పనిచేసిన అనుభవం కారణంగా మరో సారి రాజకీయంగా తన సత్తాను చాటేందుకు ప్రసాద రావు సిద్ధం అయ్యారు.