కరీంనగర్: ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాఫిక్ అయింది. అచ్చంపేట భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై టీఆర్ఎస్ అధిష్టానం ఈటలపై చర్యలు తీసుకున్న విషయం తెలిసింది. ఇప్పుడు ఈటల రాజేందర్ భూములకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా హుజారాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు 700 ఎకరాల భూములున్నాయని ఆరోపించారు. ఈటల కుటుంబం పేరు మీద 140 ఎకరాల భూమి ఉందని వ్యాఖ్యానించారు. మిగతా భూములు బినామీ పేర్లపై ఉన్నాయని తెలిపారు. సూరి, సుధాకర్ రెడ్డి, కేశవ రెడ్డి లు ఈటల రాజేందర్ బినామీలుగా పని చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి 50 ఎకరాలే ఉండాలని, మంత్రిగా పని చేసిన ఈటలకు ఆ మాత్రం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 50 ఎకరాలు మినహా మిగతా భూమిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఆరోపణలు రుజువు చేయాలని ఈటల అనుచరులు అంటున్నారు.