కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ (77 ఏళ్లు) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు భన్వర్‌లాల్ భౌతిక కాయాన్ని హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంభ సభ్యులు ప్రకటించారు.
భన్వర్‌లాల్ మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, భన్వర్‌లాల్ 1947 ఏప్రిల్ 17న జన్మించారు. 1985లో తొలిసారిగా లోక్‌దళ్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జనతాదళ్ పార్టీలో చేరారు. సర్దార్ షహర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన భన్వర్ లాల్ వరుసగా 1998 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.