కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోవడం ఖాయమన్నట్లుగా వ్యవహరించిన ఆయన సడెన్‌గా ఇప్పుడు రాజకీయ వ్యవహారశైలి మార్చుకున్నారట. పార్టీలో చేరాలంటే బీజేపీ కండిషన్స్ అప్లై సూత్రాన్ని రాజగోపాల్‌రెడ్డి ముందుంచడంతో మళ్లీ సొంతగూటిలోనే కొనసాగాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సోదరుడు వెంకట్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో పాటు టీపీసీసీ అధ్యక్ష పదవికి రేసులో ఉండటం కూడా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకోవ డం వెనుక అసలు కారణంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా బీజేపీని పొగుడుతూ..కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్‌రెడ్డి మళ్లీ చేతి గుర్తు కండువా కప్పుకుని జనంలో జోరుగా తిరుగుతున్నారట. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినంత పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ ఇలా ప్లేటు ఫిరాయించడంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయాలో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకుంటోందంట.
బీజేపీలో చేరడానికి విశ్వ ప్రయత్నం చేసిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మాత్రం చాలా కండీషన్సే పెట్టినట్లు తెలుస్తోంది. స్వతహాగా కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత కోఠారిని మెయింటెన్ చేస్తారని, రాజగోపాల్‌రెడ్డి రావడం కన్నా రాకపోవడమే పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు హైకమాండ్‌కు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని చేర్చుకోలేం అనకుండా ఆయనకు సాధ్యం కాని రెండు టాస్క్‌లను ఆయన ముందుంచి ఆయనే మానుకునేలా బీజేపీ రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించిందట.
పార్టీలో చేరాలంటే ఒకటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేదంటే పార్టీలోని సగంమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావాలి. అలా చేస్తే పార్టీని విలీనం చేసినట్లవుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త వహించినట్లవుతుందన్నది బీజేపీ యోచన. రాజీనామా చేస్తే..భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న రాజకీయ సందేహం పట్టుకోవడంతో రాజగోపాల్‌రెడ్డి వెనక్కి తగ్గారట.
ఇక రెండోది సగంమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం అసాధ్యమని భావించిన ఆయన కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అయితే వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా అంటూ సర్దుకుపోతున్నట్లు సమాచారం. పైగా సోదరుడు వెంకట్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉండటంతో కాంగ్రెస్‌లో ఎటూ మంచి ప్రాధాన్యమే ఉంటుందని భావించి కాంగ్రెస్‌లో మళ్లీ చురుకుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.