మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మునుగోడు ఉపఎన్నిక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.
స్వప్రయోజనాల కోసమే రాజగోపాల్రెడ్డి పార్టీ మారారు తప్ప.. నియోజకవర్గాల ప్రజల కోసం కాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మునుగోడు నియోజకవర్గ ఇంఛార్జ్ సీతక్క పాల్గొని.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎనిమిదేళ్లుగా ఏడడుగుల బంధంలా నడిచిన భాజపా, తెరాస.. ఇప్పుడు ఓట్ల కోసం నాటకాలాడుతున్నాయని సీతక్క ఆరోపించారు.
తెలంగాణ ఇవ్వడం అంటే.. తల్లిని చంపి బిడ్డను ఇచ్చినట్లు అన్న నరేంద్ర మోదీ.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోసం ఓట్లు ఎలా అడుగుతారని సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాజగోపాల్రెడ్డి పార్టీ విడిపోయేవారా..? అని ఆమె ప్రశ్నించారు. మునుగోడు అంటే కాంగ్రెస్ అడ్డా అని ఉద్ఘాటించిన సీతక్క.. వచ్చే ఉప ఎన్నికలో పార్టీని గెలిపించి నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు.