ఏంటి ఈ కాంగ్రెస్ స్పీడ్ ? ‘ కార్ ‘ ను ఓవర్ టేక్ చేసేస్తుందా ?

-

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే, ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలానే విధంగా నాయకుల వ్యవహార శైలి కనిపిస్తోంది. మొదటి నుంచి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో కొద్దిరోజులుగా అవి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య చిన్నపాటి వివాదం నడిచినా, మిగతా నాయకులంతా ఐక్యతతో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరికివారు సొంతంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టినట్లు గా వ్యవహరిస్తున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భట్టివిక్రమార్క, ఆసుపత్రి సందర్శన పేరుతో తెలంగాణ అంతటా తిరుగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తుండగా, రేవంత్ రెడ్డి వంటివారు టిఆర్ఎస్ ప్రభుత్వంలోని లోపాలు, అక్రమాలు, అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెస్తూ కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును పదేపదే విమర్శిస్తూ వస్తున్నారు. ఇక తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే విధంగా సమావేశాలు నిర్వహిస్తూ, ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే… గతంతో పోలిస్తే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇక త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు, దుబ్బాక ఉప ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులంతా దృష్టి సారించారు. తాజాగా టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అని, అందరు సీరియస్ గా తీసుకుని పనిచేయాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి పేరు ప్రకటిస్తామని, నాయకులంతా కలిసి కట్టుగా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
దుబ్బాక నియోజకవర్గం లోని మల్లన్నసాగర్ భూనిర్వాసితుల గజ్వేల్ సిద్దిపేట మాదిరిగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ఎవరికి వారు బాధ్యత తీసుకుని పార్టీ విజయానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విధంగా వ్యవహరిస్తుండడంతో, రానున్న రోజుల్లో కాంగ్రెస్ మరింత బలపడేలా కనిపిస్తోంది. ఒకవేళ దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే 2023 లో ఆ పార్టీకి మరింత మేలు జరుగుతుంది అనడంలో సందేహం లేదు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news