కర్ణాటకకు చెందిన ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమన్ (ఏఐఎంఐఎం)’ నేత వారిస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలబురగిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ప్రసంగించిన పఠాన్.. 15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువులపై పైచేయి సాధించగలరని వ్యాఖ్యానించారు.
‘ఇప్పుడు మాకు అందరం ఒక్కటై స్వేచ్ఛను సాధించుకునే సమయం వచ్చింది. గుర్తుపెట్టుకోండి.. మేం 15 కోట్ల మందిమే. కానీ 100 కోట్ల మంది హిందువులను డామినేట్ చేయగలం’ అని వారిస్ పఠాన్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పఠాన్.. ‘మహిళలను ముందు నిలబెట్టి ఆందోళనలు చేస్తున్నామని వాళ్లు మమ్ములను విమర్శిస్తున్నారు. కేవలం ఆడ సింహాలు బయటకు వస్తేనే మీకు చెమటలు పడుతున్నాయ్. మరి అందరం కలిసొస్తే మీ పరిస్థితి ఏంది?’ అని ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. 2014, డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి హిందూ, సిక్కు, జైన, పార్శీ, బౌద్ధ, క్రిస్టియన్ శరణార్థులకు భారతదేశ పౌరసత్వం పొందే అవకాశం కల్పించింది. కానీ ముస్లింలకు ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.