ప్రంపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తెలంగాణలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 49 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1116కి పెరిగింది. నేటివరకు రాష్ట్రంలో 7, 94, 584 కరోనా కేసులు నమోదవగా.. 7,89,357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111లుగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 15వేల 200 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 145 మందికి పాజిటివ్ గా తేలింది. కాగా, వందకు పైనే కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా 5వ రోజు. జూన్ 6వ తేదీన 65 కరోనా కేసులు నమోదవగా.. జూన్ 7న 119 కేసులు వచ్చాయి. జూన్ 9న 122 కేసులు, జూన్ 10న 155 కేసులు, జూన్ 11న 145 కేసులు వచ్చాయి.