ఏదైనా చిన్న విషయం బయటపడితే చాలు సోషల్ మీడియాలో జనం చెలరేగిపోతారు. ఒక్క విషయం పుకారు అయింది అంటే దాన్ని నిజం అని నమ్మించడం లో భాగంగా సృష్టించే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్క చిన్న వార్తను భూతద్దంలో పెట్టి పదే పదే ప్రచారం చేస్తూ సందడి చేస్తూ ఉంటారు కొందరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతుంది.
తాజాగా కరోనా వైరస్ విషయంలో ఇదే జరిగింది. ఎవడికి తోచిన ప్రచారం వాడు చేస్తూ జనాలను భయంతో చంపడం మొదలుపెట్టారు. గాంధీ ఆస్పత్రిలో ఒకరికి కరోనా సోకింది. ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పడం మొదలుపెట్టారు. అలాగే మరికొంత మంది తెలంగాణాలో మరణించారని ప్రభుత్వం చెప్పడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిపై ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి అవాస్తవ కథనాలు, పుకార్లను వ్యాపింపజేయడం సమాజానికి కీడు చేస్తుందని, సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్‌పై పుకార్ల సృష్టించే వారు చట్టరీత్యా శిక్షార్హులని తెలంగాణా పోలీసులు స్పష్టం చేసారు. వీరికి ఎన్డీఎంఏ యాక్ట్ సెక్షన్ 54 కింద ఏడాది పాటు కారాగార శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.