తెలంగాణలో కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ కలకలం..!

తెలంగాణలో కరోనా డెల్టా ఏవై.4.2 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. రోజుకు 100 నుండి 200 మధ్య కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రష్యా మరియు బ్రిటన్లో విస్తరిస్తున్న కరోనా డెల్టా ఏవై 4.2 వేరియంట్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. సెప్టెంబర్ లో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల నుండి 274 మంది రక్తనమూనాలను హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబొరేటరీ సీక్వెన్స్ కు పంపించారు.

అయితే వారిలో 48 ఏళ్ల పురుషుడు 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 వైరస్ సోకినట్టు నిపుణులు నిర్ధారించారు. అయితే వైరస్ సోకిన వారి వివరాలను వైద్య నిపుణులు గోప్యంగా ఉంచారు. ఇటీవలే ఈ వేరియంట్ కేసులు మధ్యప్రదేశ్ లో బయటపడ్డాయి. దాంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక ఇప్పుడు తెలంగాణా లోనూ ఈ వేరియంట్ కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.