భారత్, న్యూజిలాండ్ దేశాలు దాదాపుగా ఒకేసారి లాక్డౌన్ విధించాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం రెండు దేశాల్లో వేర్వేరుగా ఉంది. న్యూజిలాండ్‌లో ఇప్పుడు కరోనా కేసులు లేవు. కానీ భారత్‌లో మాత్రం రోజు రోజుకీ పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. అయితే ఇలా ఎందుకు జరిగింది ? అక్కడ పరిస్థితికి, ఇక్కడికి ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది ? అంటే…
ప్రధాని మోదీ దేశంలో మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించారు. అప్పుడు భారత్‌లో 519 కరోనా కేసులు ఉన్నాయి. అదే సమయంలో న్యూజిలాండ్‌లో 205 కేసులు ఉన్నాయి. ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ అక్కడ లాక్డౌన్ విధించారు. ఇక రెండు దేశాలలోనూ నమోదైన తొలి కరోనా కేసులు చైనా నుంచి వచ్చినవే. ఈ క్రమంలో ఇరు దేశాల్లోనూ ఎంతో మంది ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు, మిలటరీ సహాయంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు.
కాగా కేరళలో తొలి కరోనా కేసు నమోదయ్యాక జనవరి 31 నుంచి చైనాకు భారత్ విమానాల రాకపోకలను నిలిపివేసింది. కానీ న్యూజిలాండ్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆ పనిచేసింది. చైనా నుంచి కేవలం న్యూజిలాండ్‌కు చెందిన శాశ్వత పౌరులనే ఆ దేశానికి రమ్మన్నారు. ఇతర పౌరులకు చైనా నుంచి ప్రవేశాన్ని నిషేధించారు. ఇక మార్చి 15 నుంచి న్యూజిలాండ్ ఆ దేశ సరిహద్దులను లాక్ చేసింది. ఆ తరువాత 14 రోజుల పాటు ఆ దేశం మొత్తం హోం క్వారంటైన్లో ఉన్నారు.
మార్చి 25వ తేదీ నుంచి భారత్‌లో విదేశీయులకు ప్రవేశాన్ని నిషేధించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించారు. కానీ న్యూజిలాండ్‌లో పౌరులు ఆ దేశ నియమాలను కఠినంగా పాటిస్తే మన దేశంలో మాత్రం జనాలు నియమాలను గాలికొదిలేశారు. క్రమ శిక్షణ అన్నది లేకుండా పోయింది. అవసరం ఉన్నా, లేకున్నా బయటకు వచ్చారు.
ఇక న్యూజిలాండ్‌లో దేశం మొత్తం లాక్డౌన్ విధించాక అక్కడ కేవలం కిరాణా షాపులు, మెడికల్ షాపులు, హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు తదితర అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అలాగే వాహనాల రాకపోకలపై కఠినమైన నిబంధనలు పెట్టారు. జనాలను ఇండ్ల నుంచి బయటకు రానివ్వలేదు. ఇక భారత్‌లోనూ దాదాపుగా అలాగే లాక్‌డౌన్‌ను అమలు చేశారు.
న్యూజిలాండ్‌లో ఏప్రిల్ 27 నుంచి లాక్‌డౌన్‌ను లెవల్ 4 నుంచి లెవల్ 3కి మార్చారు. అప్పుడు అక్కడ 1472 కేసులు ఉండేవి. అదే సమయంలో భారత్‌లో 31,300 కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో న్యూజిలాండ్‌లో కోవిడ్ 19 మరణాల సంఖ్య 19 ఉండగా, భారత్‌లో 940గా నమోదైంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేయడంలోనూ న్యూజిలాండ్ భారత్ కన్నా ఎంతో ముందుంది. అందుకనే ఆ దేశంలో కరోనాపై నియంత్రణ సాధించగలిగారు.
అయితే న్యూజిలాండ్ మన దేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. ఆ దేశ జనాభా సుమారుగా 50 లక్షల వరకు ఉంటుంది. అంటే మన దేశంలో పూణె నగరం అంత జనాభా అన్నమాట. అందుకనే అక్కడ కరోనా కంట్రోల్ అయి పూర్తిగా తగ్గింది. అయినప్పటికీ ఇక్కడ చిన్న, పెద్ద దేశాలు అనే మాట కాదు.. అక్కడ కరోనా లాక్‌డౌన్‌ను చాలా కఠినంగా అమలు చేశారు. జనాలు కూడా క్రమశిక్షణ పాటించారు. అందుకనే అక్కడ ఇప్పుడు కరోనా కేసులు సున్నా అయ్యాయి. కానీ భారత్ మాత్రం ఇంకా ఆ అంకెకు చాలా దూరంలో ఉంది. ఇక్కడ ఇప్పుడప్పుడే కరోనా తగ్గే అవకాశాలు అస్సలు ఏమాత్రం కనిపించడం లేదు.
కాగా జూన్ 8వ తేదీన న్యూజిలాండ్‌లో చివరి కరోనా పేషెంట్‌ను డిశ్చార్జి చేశారు. కానీ అదే సమయానికి భారత్ ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఇక ముందు ముందు ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. మరి పరిస్థితి బాగు పడుతుందా, పాలకులు తీసుకున్న, తీసుకోబోయే నిర్ణయాలు జనాలకు ఏ విధంగా మేలు చేస్తాయి ? అన్న వివరాలు తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.