రాజకీయం చేయడానికి వస్తువు ఏదైతేనేం.. చేయాలనుకుంటే.. ఏదైనా రాజకీయం చేయొచ్చు. సమయం సందర్భం ఏదైనా ఫర్లేదు.. రాజకీయాలే ముఖ్యం! ఇదే ఫార్ములాను అవలంభిస్తున్నారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ. ఆది నుంచి కూడా తీవ్ర వివాదాస్పద నాయకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె.. తాజాగా కరోనా నేపథ్యంలోనూ తనదైన శైలిలో రాజకీయాలు చేసి.. ఇప్పుడు అందరిలోనూ చర్చకు దారితీశారు. విషయంలోకివెళ్తే.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. ఎవరు చేయగలిగిన సాయం వారు చేయాలని చెప్పారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల జీతాల విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఎమ్మెల్యేల వేతనాలు అన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. చాలా మంది ఎమ్మెల్యేలు తమ తమ పరిధిలో ప్రజలకు సాయం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి తన పరిధిలో దాదాపు రెండు లక్షల మాస్కులు, రెండున్నర లక్షల శానిటైజర్లను పంపిణీ చేశారు. ఏపీ వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా విషయంలో భారీగా సాయం చేస్తున్నారు.
ఇదేతరహాలో పేట ఎమ్మెల్యే విడదల కూడా తన నియోజకవర్గంలో పేదలకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, దీనికి కూడా రాజకీయాలు పులుముకోవడం ఇప్పుడు చర్చకు వచ్చింది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే విడదల వర్గం వీటిని పంపిణీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, తనకు వైరి వర్గంగా ఉన్న సొంత పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గం బలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీటిని పంపిణీ చేయకుండా వివక్ష చూపించారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
అదే సమయంలో తన ఎమ్మెల్యే నిధుల నుంచి కాకుండా నియోజకవర్గంలోని కొందరు వ్యాపారుల నుంచి నిధులు సేకరించి, వాటితో వీటిని కొనుగోలు చేసి, ప్రజలకు పంచి తనపేరును వేసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, విడదల అనుచరులు కొందరు ఇంకా వీటిని పంపిణీ చేయలేదని, మేడం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.