ఎక్స్‌క్లూజివ్: క‌రోనా క‌వ‌చ్ ఇన్సూరెన్స్ పాల‌సీలు.. పూర్తి వివ‌రాలు..!

-

కోవిడ్ 19 నేప‌థ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (IRDA) దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు క‌రోనా స్పెష‌ల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కంపెనీలు అంద‌జేయాల‌ని ఆదేశించింది. దీంతో శుక్ర‌వారం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు.. ప్ర‌త్యేకంగా క‌రోనా క‌వ‌చ్ పాల‌సీల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నాయి. ఆయా కంపెనీలు అందించే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీలు భిన్నంగా ఉంటాయి. కాక‌పోతే అన్నీ దాదాపుగా ఒకేలాంటి స‌దుపాయాల‌ను అందిస్తాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

corona kavach insurance policies details

కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే క‌రోనా ప్ర‌త్యేక పాల‌సీల‌ను తీసుకుంటే.. త‌ద్వారా విప‌త్క‌ర ప‌రిస్థితిల్లో చేతిలో డ‌బ్బులు లేక‌పోయినా.. ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ద్వారా ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో చికిత్స తీసుకోవ‌చ్చు. ఇందుకు గాను ఇన్సూరెన్స్ కంపెనీలు బేసిక్, ఆప్ష‌న‌ల్ క‌వ‌ర్ స‌దుపాయాలను త‌మ క‌రోనా పాల‌సీల్లో అందించ‌నున్నాయి. ఈ పాల‌సీల‌ను తీసుకున్న వారు క‌రోనా కింద హాస్పిట‌ళ్లలో చేరి చికిత్స పొందితే క‌నీసం రూ.50వేల నుంచి గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు క్లెయిమ్ స‌దుపాయాన్ని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

క‌రోనా హెల్త్ పాల‌సీల‌ను కంపెనీలు మూడున్న‌ర నెల‌లు, ఆరున్న‌ర నెల‌లు, తొమ్మిదిన్న‌ర నెల‌ల కాల‌ప‌రిమితితో ఇవ్వ‌నున్నాయి. అవ‌స‌రం అనుకుంటే పాల‌సీల‌ను రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు. ఇక 18 నుంచి 65 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య ఉన్న‌వారు ఎవ‌రైనా ఈ పాల‌సీల‌ను తీసుకోవ‌చ్చు. వారు 25 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు ఉండే త‌మ పిల్ల‌ల‌ను ఈ పాల‌సీలో చేర్చ‌వ‌చ్చు. అందుకు అద‌నంగా ప్రీమియం చెల్లించాల్సిన ప‌ని ఉండ‌దు. ఫ్యామిలీ క‌వ‌రేజీ కింద పాల‌సీ ప్రీమియం చెల్లిస్తే చాలు. అంటే.. ఒక వ్య‌క్తి క‌రోనా హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకుంటే.. అత‌ని భార్య‌, పిల్ల‌ల పేర్లు కూడా అందులో యాడ్ అవుతాయి. వారికి మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన ప‌నిలేదు.

ఇక ప్రీమియం ఎంత చెల్లించాల‌నే విష‌యం.. వ్య‌క్తి వ‌య‌స్సు, ఎంపిక చేసుకునే హాస్పిట‌ళ్ల వివ‌రాలు, వారు నివాసం ఉంటున్న ప్ర‌దేశం (మెట్రో, నాన్ మెట్రో, టౌన్‌), ఆధారప‌డ్డ ఇత‌ర కుటుంబ స‌భ్యుల సంఖ్య‌, ప్ర‌స్తుతం ఇంకా ఏమైనా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా.. అనే అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీలు భిన్న ర‌కాల ప్లాన్ల‌ను అందిస్తాయి.

కోవిడ్ స్టాండ‌ర్డ్ హెల్త్ పాల‌సీ తీసుకుంటే బేసిక్ క‌వ‌రేజీ ల‌భిస్తుంది. హాస్పిట‌ల్‌లో క‌నీసం 24 గంట‌ల పాటు అయినా చికిత్స పొందితేనే క్లెయిమ్‌కు అర్హులు అవుతారు. ఇందులో రూం, బోర్డింగ్, న‌ర్సింగ్ ఖ‌ర్చులు, స‌ర్జ‌న్ ఫీజు, అన‌స్థీషియా ఫీజు, మెడిక‌ల్ ప్రాక్టిష‌న‌ర్ ఫీజు, ఇత‌ర క‌న్స‌ల్టెంట్ల ఫీజులు, స్పెష‌ల్ క‌న్స‌ల్టేష‌న్ ఫీజులు, టెలిమెడిసిన్ ద్వారా పెట్టిన ఖ‌ర్చులు క‌వ‌ర్ అవుతాయి. అలాగే అన‌స్థీషియా, బ్ల‌డ్‌, ఆక్సిజ‌న్‌, ఆప‌రేష‌న్ థియేట‌ర్ చార్జిలు, స‌ర్జిక‌ల్ ప‌రిక‌రాలు, వెంటిలేట‌ర్ చార్జిలు, మెడిసిన్స్ ఖ‌ర్చులు, టెస్టుల ఖ‌ర్చులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్కులు, ఇత‌ర ఖ‌ర్చులు, ఐసీయూ చార్జిలు, ఆంబులెన్స్ చార్జిలు (రూ.2వేల వ‌రకు) క‌వ‌ర్ అవుతాయి.

హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యాక హోం ట్రీట్‌మెంట్‌కు కూడా కోవిడ్ స్టాండ‌ర్డ్ హెల్త్ పాల‌సీలో క‌వ‌ర్ ల‌భిస్తుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వ‌చ్చాక 14 రోజుల పాటు ఇంటి వ‌ద్ద తీసుకునే చికిత్స‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌ను కూడా ఈ పాల‌సీ కింద ఇన్సూరెన్స్ కంపెనీలు భ‌రించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు వైద్యుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. వైద్యులు.. రోగులు బాగ‌య్యారు అనుకునేంత వ‌ర‌కు నిత్యం ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. వారిని వైద్యులు ప‌ర్య‌వేక్షించాలి. అయితే పాల‌సీలు తీసుకున్న వారు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన నెట్‌వ‌ర్క్ లిస్ట్‌లో ఉన్న హాస్పిట‌ళ్ల‌కు వెళ్తేనే ఈ స‌దుపాయాలు అందుతాయి.

హాస్పిట‌ల్‌లో చేర‌డానికి 15 రోజుల ముందు వ‌ర‌కు, చేరాక హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యాక మ‌రో 30 రోజుల వ‌ర‌కు క‌వ‌ర్ ల‌భించేలా పాల‌సీలు తీసుకోవ‌చ్చు. ఇక పాల‌సీలో ఆప్ష‌న‌ల్ క‌వ‌రేజీ తీసుకుంటే.. నిత్యం హాస్పిట‌ల్‌కు కాకుండా పెట్టే ఇత‌ర ఖ‌ర్చుల‌కు క‌వ‌రేజీ పొంద‌వ‌చ్చు. హాస్పిట‌ల్‌లో ఉండే 15 రోజుల కాలానికి నిత్యం ఈ క‌వ‌రేజీ ఇస్తారు. పాల‌సీదారుడు ఇన్సూర్ చేసిన మొత్తంలో 0.5 శాతాన్ని నిత్యం ఇలా అవుట్ ఆఫ్ పాకెట్ హాస్పిట‌ల్ ఖ‌ర్చుల కింద పొంద‌వ‌చ్చు. అయితే క‌రోనా హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకునేముందు వినియోగ‌దారులు అన్ని అంశాల‌నూ పూర్తిగా తెలుసుకున్నాకే పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. ఎంత క‌వ‌ర్ ల‌భిస్తుంది, ఏయే హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొంద‌వ‌చ్చు, ఎన్ని రోజుల‌కు క‌వ‌ర్ ఇస్తారు, అందుకు ఉండే ష‌రతులు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకున్నాకే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకుంటే.. ముందు ముందు క‌రోనా వ‌ల్ల హాస్పిట‌ళ్లలో చేరి చికిత్స తీసుకున్నాక‌.. బిల్లుల విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news