పోలవరం ప్రాజెక్టు.. గడిచిన చంద్రబాబు హయాంలో నిత్యం వినిపించిన పేరు ఇది! అంతేకాదు.. ప్రతి సోమవారాన్ని ఆయన పోలవారం చేసుకుని.. ఈ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. అదేసమయంలో ఆయనను సమర్ధించిన కొన్ని పత్రికలు నిత్యం అక్కడ జరుగుతున్న, జరగబోయే పనులపై పుంఖాను పుంఖాలుగా వార్తలు ముద్రించాయి. అయితే, ఇప్పటి వరకు అక్కడ జరిగింది ఏమో తెలియదు.. కానీ, పోలవరం కారణంగా కోల్పోయిన తమ ఇళ్లు, పొలాలకు సంబంధించిన పరిహారం అందలేదని ఇక్కడి గిరిజనులు సహా రైతులు వాపోతున్నారు. ఇది గత చంద్రబాబు హయాంలో పట్టించుకున్న పాపాన పోలేదు.
అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టు పనులను ముందుకు నడిపిస్తూనే అంతే వేగంతో ఇక్కడి ప్రజలకు పునరావాసంపై దృష్టి పెట్టింది. గిరిజనులకు రూ.3.59 లక్షలు. గిరిజనేతరులకు రూ.3.34 లక్షలతో 379.25 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా పక్కా ఇళ్లను కట్టి నిర్వాసితులకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. పునరావాస కాలనీలకు విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలన్నీ కల్పించనుంది. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించాలని నిశ్చయించింది. ఇక, గిరిజనులకు భూమికి బదులుగా రెండెకరాల సాగు భూమిని సేకరించి ఇవ్వనుంది.
ఇది.. నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు ఇక్కడి వారికి ఉపాధి చూపించే పనులకు కూడా జగన్ ప్రభుత్వం అడుగు లు వేసింది. నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది అంతేకాదు, ఇవన్నీ.. కూడా గోదావరికి వరద పెరిగేలోగా 41.15 కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించనుంది. అదేసమయంలో మిగిలిన కుటుంబాలకు దశలవారీగా వేగంగా పునరావాస కల్పనకు చర్యలు చేపట్టనున్నారు. నిజానికి ఈ పనులన్నీ.. చంద్రబాబు తన హయాంలోనే పూర్తి చేస్తానని ప్రతివారం చెప్పేవారు.
కానీ, ఆయన కు ఇక్కడి గిరిజనులపై ఎలాంటి శ్రద్ధా లేక పోవడంతో అవన్నీ పడకేశాయి. కానీ, ఇప్పుడు జగన్ ఒకవైపు ప్రాజెక్టు పనులను దూకుడుగా ముందుకు తీసుకు వెళ్తూనే.. మరోవైపు.. పునరావాసంపై దృష్టి పెట్టారు. ఇది పూర్తయితే.. పోలవరం విషయంలో బాబు కన్నా జగన్‌కే ఎక్కువమార్కులు పడతాయని అంటున్నారు పరిశీలకులు.