ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడ్డారు. దేశంలో కరోనాను నియంత్రించడం కోసం దాదాపుగా 3 నెలల పాటు సుదీర్ఘమైన లాక్ డౌన్ ను విధించారని, పేదలపై కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌తో దాడి చేసిందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో తీవ్రంగా ప్రభావం ఎదుర్కొంటున్న అసంఘటిత రంగాన్ని కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ మరింత కుదేలయ్యేలా చేసిందన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో తాను మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కాగా త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ కేంద్రంపై ఉభయ సభల్లోనూ తమ ప్రశ్నలతో దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా అంశంతోపాటు తీవ్రంగా పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థపైనే పార్టీలన్నీ కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో రాహుల్ గాంధీ పై విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లాక్‌డౌన్‌ను పెట్టింది కరోనాపై దాడి చేసేందుకు కాదని, పేదలపై దాడి చేసేందుకేనని రాహుల్ అన్నారు. కరోనా లాక్‌డౌన్ యువత భవిష్యత్తుపై దాడి చేసిందన్నారు. కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులపై చేసిన దాడి లాక్‌డౌన్ అని అన్నారు. మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలని, ఈ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
లాక్‌డౌన్ అనంతరం పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు చెప్పిందని, అయినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. ప్రజలకు డబ్బును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అలా చేయలేదన్నారు.