ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. భారత్‌లోనూ ఈ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా నోయిడాలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారించారు. నోయిడాకు చెందిన ఓ 35 ఏళ్ల టూరిస్టు గైడ్‌కు కరోనా ఉన్నట్లు నిర్దారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 69కి చేరుకుంది.
కాగా నోయిడాలో కరోనా సోకిన ఆ వ్యక్తి ఆగ్రా, జైపూర్‌లలో ఇటలీ బృందానికి టూరిస్టు గైడ్‌గా వ్యహరించాడు. ఆ దేశస్థులతో కలిసి అతను ఆయా ప్రాంతాల్లో తిరిగాడని, ఈ క్రమంలోనే అతనికి కరోనా సోకి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాగ్ భార్గవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇక ఆ వ్యక్తికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యుల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటిని పూణేలోని నేషనల్ వైరాలజీ సెంటర్‌లో పరీక్షిస్తామని తెలిపారు.
ఇక ఇప్పటి వరకు కేరళలో 17, హర్యానాలో 14, మహారాష్ట్రలో 11, యూపీలో 9, ఢిల్లీలో 5, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 3, లడఖ్‌లో 2 కేసులు నమోదు కాగా, తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడులో ఒక్కో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే కేరళ, కర్ణాటక, జమ్మూలలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించగా, సినిమా హాల్స్‌ను మూసివేశారు.