కరోనా సెకండ్ వేవ్ : ఈ రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకు 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఢిల్లీతో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మరింత ప్రమాదకరానికి సూచనలని నిపుణులు భావిస్తున్నారు. కరోనా బాధితులతోపాటు చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. అయితే తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఇంకొన్ని రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో లాక్‌డౌన్ విధించనున్నారు.

Lock-Down
Lock-Down

నేటి నుంచి మహారాష్ట్రలో..
దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. అలాగే పూనేలో ఈ రోజు నుంచి పాక్షిక లాక్‌డౌన్ విధించడం జరుగుతుంది. పూనేలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా రాత్రివేళలో కర్ఫ్యూ విధించారు. అన్ని రకాల మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, షాపులు మూతబడ్డాయి. పాఠశాలలు, కళాశాలలు ఏప్రిల్ 30వ తేదీ నుంచే మూసివేయబడ్డాయి. కేవలం అత్యవసర సేవలు, హోం డెలవరీలకే పర్మిషన్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.

మధ్యప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో..
కరోనా కేసుల తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఖార్గోన్, చింద్వారా, రత్లాం నగరాల్లో రాత్రి వేళల్లో లాక్‌డౌన్ విధించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్..
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దుర్గ్ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 4 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,174 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు ఛాన్స్..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా.. ఢిల్లీలో మాత్రం నాలుగో దశ కరోనా విలయం కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ చెప్పుకొచ్చారు. కరోనా తీవ్రత పెరిగితే భవిష్యత్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ అవసరాలు, ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

యూపీలో కఠిన ఆంక్షలు..
ఉత్తరప్రదేశ్ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఎనిమిదో తరగతి వరకు ఉన్న ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్‌లను ఏప్రిల్ 11వ తేదీ వరకు మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రస్తుతం యూపీలో 14,073 యాక్టివ్ కేసులుండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర రాజధాని లక్నోలో అత్యధికంగా 940 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనాపై కేబినెట్ సమావేశం
కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శుక్రవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 11 రాష్ట్రాలలో పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు, చండీగఢ్ ఉన్నాయి.