కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ వరకు సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని అన్నారు. అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ నెలలో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని అదార్ నిన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
క్లినికల్ ట్రయల్ తాజా ఫలితాలు లాన్సెట్ లో ప్రచురించడంపై పూనావాలాకు నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. వాక్సిన్ విడుదలకు క్లియరెన్సు వచ్చిన తరువాత సరఫరాలో ఒడిశాకు ప్రాధాన్యత ఇవ్వడానికి సహకరించాలని పూనావాలాను కోరారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ కు భువనేశ్వర్ కేంద్రం ఇనిస్టిట్యూట్‌లో మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటి, రెండు దశల ట్రయల్స్ కోసం దేశం మొత్తం మీద ఐసిఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో భువనేశ్వర్ ఒకటి.