అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాకో రాజకీయం జరుగుతోంది. నేతలు తలకో విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందనే వాదన వినిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం రాజకీయాలు పార్టీలో వేడిని పెంచాయి. హిందూపురం ఎంపీగా గత ఏడాది ఎన్నికల్లో మాజీ పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. సీఐగా ఉన్నప్పటి నుంచే దూకుడుగా ఉన్న ఆయన ఎంపీ అయ్యాక కూడా అదే పంథాలో వెళుతున్నారు. దీంతో వైసీపీలోనే కొందరు నేతలకు ఆయన వ్యవహార శైలీ నచ్చడం లేదు. ఇక ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గం నేతలను ఎంకరేజ్ చేస్తుండడంతో కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు సృష్టిస్తోన్న ఆయన ఇప్పుడు ఏకంగా ఓ అసెంబ్లీ స్థానంపై కన్నేయడంతో మరో వివాదానికి ఆయన కేంద్ర బిందువుగా మారారు.
మాధవ్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారనే వాదన వినిపిస్తోంది. ఎంపీ అయి ఉండి.. ఆయనకు ఇదేం తొందర ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక, హిందూపురం ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసిన మాజీ పోలీస్ ఐజీ.. ఇక్బాల్ గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు అయితే, మైనార్టీ కోటాలో ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గత ఏడాది రంజాన్ సందర్భంగా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే, ఇక్బాల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నమాట వాస్తవం. దీంతో ఎంపీ గోరంట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనూ చక్రం తిప్పేస్తున్నారు.
ఇక్బాల్‌కు అక్కడ కేడర్‌తో కాస్త గ్యాప్ ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని హిందూపురంలో దూసుకుపోతున్నారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించినా.. ఆయనే వచ్చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. అదేంటి నా నియోజకవర్గంలో నీవేలు.. అంటే.. నువ్వు ఇక్కడ ఉండడం లేదుకదా ? అని గోరంట్ల కయ్యానికి రెడీ అవుతున్నారు. ఇక, ఇదే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు వైఎస్సార్ సీపీ ఇంచార్జ్‌గా ఉన్న నవీన్ నిశ్చల్ ను పక్కన పెట్టిన జగన్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన రెబల్‌గా మారారు.
ఇక్బాల్‌కు చెక్ పెట్టేలా నవీన్ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో.. హిందూపురం వైఎస్సార్ సీపీలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. కొసమెరుపు ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంపీ గోరంట్ల ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారట!! ఈ విషయం జిల్లా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మిథున్‌రెడ్డికి తెలిసిన తర్వాత.. మీరే సమన్వయం చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకొన్నారట!! ఇదీ వైఎస్సార్ సీపీలో పోలీసుల ఫైంటింగ్.