కరోనా వైరస్ చైనాలో వూహాన్ నగరంలో ఉన్న వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో ముందుగా ఉద్భవించిందని పదే పదే ఎంతో మంది వ్యాఖ్యలు చేస్తున్నా చైనా మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టి పారేస్తోంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం వూహాన్‌లో పర్యటించి కరోనా వైరస్ విషయంలో చైనాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ చాలా దేశాలు మాత్రం కరోనా సృష్టి వెనుక చైనాయే ఉందని ఆరోపిస్తున్నాయి. ఇక అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన సీక్రెట్ సర్వీస్ సంస్థలు కరోనా ఎక్కడ ముందుగా సృష్టించబడిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాయి.
అయితే అమెరికా మాజీ సైనికాధికారి డాక్టర్ లారెన్స్ సెల్లిన్ ఇదే విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ భారత మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా ఎన్నో సంవత్సరాల నుంచి జీవాయుధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, అందులో కరోనా వైరస్ ఒక భాగమని ఆరోపించారు. 1990లలోనే చైనా జీవాయుధాలను సృష్టించే కార్యక్రమాలను ప్రారంభించిందని, అయితే దురదృష్టవశాత్తూ చైనాకు చెందిన కొందరు సైంటిస్టులు అమెరికా రీసెర్చి ఇనిస్టిట్యూట్ల పరిశోధనల్లో భాగమయ్యారని, అలాగే బయటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర పరిశోధన సంస్థలను చైనా నియంత్రిస్తుందని అన్నారు. అందుకనే కరోనా వైరస్ పుట్టుక గురించి సరైన వివరాలు తెలియడం లేదన్నారు.
ఇక ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో తక్కువ కేసులు నమోదు కావడం, వారు త్వరగా కరోనా నుంచి బయట పడడం వంటివన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి, ఆయా విషయాలపై స్పందించాలని లారెన్స్‌ను అడగ్గా.. ఆయన బదులిస్తూ, చైనాలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడం, వారు త్వరగా ఆ మహమ్మారి నుంచి బయట పడడం నిజంగా అనుమానాస్పదంగానే ఉందని, అయితే దీని గురించి ఇంకా తెలియాల్సిన సమాచారం ఉందన్నారు. చైనా కొన్ని విషయాలను దాచేసిందని అభిప్రాయపడ్డారు.