చైనాలో 2019 నవంబర్ నెలలో మొదటి కోవిడ్ 19 కేసు నమోదైంది. ఆ తరువాత ఆ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. కరోనా వైరస్ మొదట ఆవిర్భవించినప్పటి నుంచి వైద్య నిపుణులు ఆ వైరస్ పుట్టుక చైనాలోనే జరిగిందని చెబుతూ వచ్చారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైందని అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకైందని చెబుతుండడం సరైందేనని అంచనాకు వచ్చాయి.
టైమ్స్‌లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం, కరోనా వైరస్ పుట్టుక ఎక్కడ జరిగింది అన్న విషయంపై బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ప్రస్తుతం విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్ సహజంగా ఉద్భవించే అవకాశాలు చాలా తక్కువని, దాన్ని మనుషులే సృష్టించారని వారు అంచనాకు వచ్చారు. అయితే గతంలోనే పలువురు వైద్య నిపుణులు సరిగ్గా ఇవే వాదనలు చేయగా చైనా వాటిని కొట్టి పారేసింది. ఈ క్రమంలోనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా ఎక్కడ పుట్టింది అన్న విషయాన్ని దర్యాప్తు చేసి తేల్చాలని అమెరికా ఇంటెలిజెన్స్ సర్వీస్‌ను ఆదేశించారు. వారు 90 రోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదికను అందించనున్నారు. దీంతో అటు బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్, ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ సర్వీస్.. రెండూ ఎలాంటి నివేదికలు అందిస్తాయి ? అన్న విషయం ఉత్కంఠగా మారింది.
కాగా కరోనా వైరస్‌ను చైనాయే కావాలనే సృష్టించిందని, చైనా సైంటిస్టులు దాన్ని రివర్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీతో సృష్టించారని గతంలోనే పలువురు సైంటిస్టులు చెప్పారు. కానీ దాన్ని ఎవరూ విశ్వసించలేదు. అయితే ప్రస్తుతం కరోనా పుట్టుకపై అమెరికా, బ్రిటన్‌లు దర్యాప్తు చేస్తుండడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మరి నివేదికలు ఎలా వస్తాయో చూడాలి.