గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ ప్రపంచంలోని ప్రజలకు నిత్యకృత్యం అయింది. దీని వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఎన్నో లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే నిజానికి 20వేల ఏళ్ల కిందటే కరోనా వ్యాప్తి చెందిందని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా తెలిపారు.
సుమారుగా 20వేల ఏళ్ల కిందట తూర్పు ఆసియాలో కరోనా ప్రబలిందని సైంటిస్టులు తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాలకు చెందిన పలువురు సైంటిస్టులు ఈ పరిశోధన చేపట్టారు. అందుకు గాను వారు పలు దేశాలకు చెందిన 2500 మంది నుంచి జీనోమ్‌లను సేకరించి విశ్లేషించారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే..
సుమారుగా 20 వేల ఏళ్ల కిందట తూర్పు ఆసియాలో నివసించిన వారికి కరోనా వచ్చిందని తెలిపారు. వారి జీనోమ్ లను విశ్లేషించగా ఈ విషయం బయట పడిందన్నారు. అయితే అప్పటి వైరస్ అనేక మార్పులకు లోనైందని తెలిపారు. కాగా ఈ పరిశోధనలకు చెందిన వివరాలను వారు కరెంట్ బయాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
సాధారణంగా మన శరీరంపై వైరస్‌లు దాడి చేసినప్పుడు అవి జీనోమ్‌లకు చెందిన ముద్రలను వదిలివెళ్తాయి. వాటిని విశ్లేషించడం ద్వారా పై వివరాలు తెలుస్తాయి.. అని నిపుణులు తెలిపారు. అయితే అప్పట్లో వ్యాప్తి చెందిన ఆ వైరస్ కేవలం జపాన్, చైనా, వియత్నాం దేశాలకు మాత్రమే విస్తరించి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తామని వారు చెబుతున్నారు.