కరోనా వస్తే పెద్దల్లో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి లక్షణాలు ఉండవు. అయితే కోవిడ్ చిన్నారులకు కూడా వ్యాప్తి చెందుతుంది కనుక తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించాలి. ఈ క్రమంలోనే కోవిడ్ వచ్చిన చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు వివరాలను వెల్లడించింది.
పెద్దల్లో లాగే చిన్నారుల్లోనూ కొందరికి స్వల్ప, మధ్యస్థ లక్షణాలు రావచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరికి పరిస్థితి తీవ్రతరం కావచ్చు. అయితే లక్షణాలు లేని వారు ఇంట్లో 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు కనిపించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారిలో పలు లక్షణాలు కామన్‌గా కనిపించే అవకాశం ఉంది.
చిన్నారులకు కోవిడ్ వస్తే జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడం, అలసట, గొంతు సమస్యలు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు, వాసన, రుచి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించాలి. లేదంటే పరిస్థితి తీవ్రతరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఇక గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్‌కు గాను 2-12 ఏళ్ల చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో త్వరలోనే చిన్నారులకు కూడా కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.