ఈ పరిస్థితుల్లోనే జనాలు విచ్చలవిడిగా రోడ్ల మీదకు వస్తున్నారు. ఎవరికీ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ నాలుగు రోజుల్లో పెద్ద మార్పులనేమీ ఊహించనక్కరలేదు.
కేంద్రం ఏప్రిల్ 20 నుంచి అనుమతించిన లాక్‌డౌన్ సడలింపులు కరోనా నియంత్రణకు అశనిపాతంగా మారే అవకాశముంది. సడలింపుల మార్గదర్శకాలు ప్రభుత్వ అధికారులను, వైద్య నిపుణులను ఆశ్యర్యానికి గురిచేసాయి. ఇది దాదాపు లాక్‌డౌన్ లేకపోతే ఎలా ఉంటుందో, అలాగే ఉన్నట్లు వారు భావిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన జోన్లు, కరోనా కట్టడికి అంతగా పనికిరావనే భావన అందరిలో నెలకొంది. వీటివల్ల అన్నిచోట్లా రాకపోకలు పెరుగుతాయి. ప్రస్తుతం కరోనా భారత్‌లో వీరవిహారం చేస్తోంది. రోజురోజుకీ కేసులు వందల్లో బయటపడుతున్నాయి. ఎక్కడా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు లేవు. మరి ఇటువంటప్పుడు మళ్లీ వదిలేస్తే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం ఇండియాలో 12,456 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,520 యాక్టివ్ కేసులున్నాయి. రోజుకి కనీసం 300లకు తక్కువ కాకుండా కొత్త కేసులు పుడుతున్నాయి. 30 నుంచి 50 మంది మరణిస్తున్నారు. మరి పురోగతి ఎక్కడున్నట్లు? ఏ రాష్ట్రం చూసినా, కరోనా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. తబ్లిగీల వల్ల అన్ని రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. కేసుల మీద కేసులు పెరిగాయి. వాటిని నియంత్రించడానికే రాష్ట్ర ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. ఇక పులి మీద పుట్రలా అందరినీ వదిలేస్తే, దేశాన్ని తీసుకెళ్లి కరోనా నోట్లో పెట్టినట్లే. అయితే రాష్ట్రాలకు ఈ సడలింపుల అమలు విషయంలో కేంద్రం స్వేచ్ఛనిచ్చింది. అంటే నిర్ణయం ఇక ఏదైనా, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది.
నిజానికి లాక్‌డౌన్ అనేది రాష్ట్రాలకు కూడా ఆత్మహత్యాసదృశం. అన్ని రాష్ట్రాలు తమతమ ఆదాయాన్ని వదులుకుంటూ, కత్తి మీద సాము చేస్తున్నాయి. ఓ పక్క ఆదాయం లేక, మరోపక్కఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. కేంద్రం రాయితీలు, పథకాలు, ప్యాకీజీలు ప్రకటించాల్సిన సందర్భం. అలాంటిదేమీ లేకపోగా, పరిస్థితులు త్వరలో చక్కబడతాయన్న ఆశతో బండి నెట్టకొస్తున్న రాష్ట్రాల నెత్తిన ఒక్కసారిగా కేంద్రం పిడుగులు కురిపించింది. నిజమే… దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. కానీ, ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాదనే సరైనది. కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసి, విషయం ఇంకా ఘోరంగా మారడంతో తిరిగి అమల్లోకి తెచ్చిన సందర్భాలున్నాయి. 130కోట్ల జనాభా, కిక్కిరిసినట్లుండే పట్టణాలు, నగరాలు. ఇంకా సరిగ్గా టెస్టింగ్‌లే జరగడంలేదు. లక్షల్లో పరీక్షలు జరిగితే, అప్పడు తెలుస్తుంది, ఇండియా పరిస్థితి ఏమిటో.
అయితే, సడలింపు విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం కొద్దిలో కొద్దిగా మేలు చేసినట్లే. ఇప్పుడు రాష్ట్రాలు లాక్‌డౌన్ విషయంలో ఇంకాస్తా కఠినంగా ఉండగలిగితే,మే 3 తర్వాత మేలు జరిగే అవకాశముందని నిపుణుల అభిప్రాయం. లేకపోతే ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వైద్యవర్గాలు, పరిపాలనా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.