కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (16-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. భారతదేశంలోని ఫార్మా కంపెనీలకు ప్రపంచం మొత్తానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ ను అందించే శక్తి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కు సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయని, ప్రముఖ విషయాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం మానవాళికి అవసరమయ్యే ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
2. ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అక్కడి యాచకులకు కోవిడ్ కిట్‌లను అందజేయనున్నారు. అందులో వారికి అవసరం అయ్యే మాస్కులు, సబ్బులు ఉంటాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో ఉంటున్న యాచకులు, చిత్తు కాగితాలు ఏరుకునేవారికి, పేదలకు త్వరలో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు.
3. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 8వ తేదీ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. గతంలో అక్టోబర్ 2వ తేదీ వరకు ఆ గడువు విధించగా.. దాన్నిప్పుడు అమెజాన్ పొడిగించింది.
4. తిరుమలలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొండపైకి వచ్చే ముందే భక్తుల వివరాలను సేకరించనున్నారు. భక్తులు తమ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, కొండపైకి వస్తున్న సమయం తదితర వివరాలను వారికి ఇచ్చే చీటీలలో రాసి అలిపిరి వద్ద అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
5. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయనతో ఉన్న తన సోదరుడు, బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి స్నేహాశీష్ గంగూలీకి కరోనా సోకింది. దీంతో గంగూలీ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
6. హైదరాబాద్‌లో 2200 మంది హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిన కరోనా పేషెంట్ల వివరాలు గల్లంతు అయ్యాయి. వారికి తెలంగాణ ప్రభుత్వం అందజేసిన కరోనా కిట్లను ఇవ్వాల్సి ఉంది. కానీ వారి చిరునామా, ఫోన్ నంబర్లు తప్పుగా ఉండడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
7. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 606 మంది కరోనా వల్ల చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 9,68,876కు చేరుకుంది. మొత్తం 24,915 మంది చనిపోయారు. 6,12,814 మంది కోలుకోగా, 3,31,146 మంది చికిత్స పొందుతున్నారు.
8. కరోనా వైరస్ వల్ల ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 8.3 కోట్ల నుంచి 13 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఆహార భద్రత, పోషణ పరిస్థితి 2020 నివేదికను విడుదల చేశారు. పేదలకు ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
9. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య న్యూయార్క్-ఢిల్లీ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కోలకు మొత్తం 18 విమానాలు నడపనుంది. అలాగే ఫ్రాన్స్ నుంచి ఇండియాకు జూలై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమానాలను నడపనున్నారు. ఈ మేరకు భారత్ ఆయా ఎయిర్‌లైన్స్ కంపెనీలతో ఒప్పందాలను కుదర్చుకుంది.
10. దుబాయ్‌లోని ఓ హాస్పిటల్‌లో 80 రోజుల పాటు కరోనా చికిత్స తీసుకున్న జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తికి ఆ హాస్పిటల్ వారు రూ.1.52 కోట్ల బిల్లు వేశారు. దీంతో ఇండియా కాన్సులేట్ స్పందించి దుబాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. వారు ఆ బిల్లును మాఫీ చేశారు. అలాగే ఆ వ్యక్తికి రూ.10వేలు సహాయం చేసి విమాన టిక్కెట్లను కూడా ఇప్పించి భారత్‌కు పంపించారు. దీంతో అతను ప్రస్తుతం జగిత్యాలలో ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.