కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం (18-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,963 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక్క రోజులో ఏకంగా 994 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 44,609కు చేరుకుంది. మొత్తం 586 మంది చనిపోయారు. 21,763 మంది కోలుకున్నారు. 22,260 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
2. తిరుమల ఆలయ పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో ఆయనను చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే తిరుమలలో 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.
3. దేశంలో 18 కోట్ల మంది ప్రజలు కరోనా పట్ల రోగ నిరోధకతను కలిగి ఉన్నారని థైరోకేర్ అనే ల్యాబ్ వెల్లడించిన నివేదికలో తేలింది. మొత్తం 53వేలకు పైగా యాంటీ బాడీ టెస్టింగ్‌లు చేయగా, 200కు పైగా కేసుల్లో 15 శాతం యాంటీ బాడీలు పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల దేశంలో సుమారుగా 18 కోట్ల మంది కరోనా పట్ల ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని థైరోకేర్ వెల్లడించింది.
4. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,884 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 671 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,38,716కు చేరుకుంది. మొత్తం 26,273 మంది చనిపోయారు. 3,58,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,53,750 మంది కోలుకున్నారు.
5. తిరుమలలో శ్రీవారి దర్శనాలను కొన్ని వారాల పాటు ఆపేయాలని టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆలయంలో అర్చకులకు ప్రత్యామ్నాయం లేదని, వారి స్థానంలో మరొకరిని నియమించడానికి వీలు కాదని, అందుకని కొద్ది రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తే బాగుంటుందన్నారు.
6. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అనేక దేశాల్లో నియమాలను విధిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను ప్రజలను మాస్కులను ధరించాలని ఆదేశించలేనని అన్నారు. మాస్కులు ధరించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని, ఎవరి ఇష్టం ప్రకారం వారు మాస్కులను ధరించాలని అన్నారు.
7. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అక్కడ 144 మంది చనిపోయారు. మొత్తం 3,00,937 కరోనా కేసులు నమోదు కాగా, 11,596 మంది చనిపోయారు. 1,65,663 మంది కోలుకున్నారు.
8. తెలంగాణ రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను ఆగస్టు 14వ తేదీ వరు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను విచారించనున్నారు. అవే ఆదేశాలను జిల్లా కోర్టులు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే నేరుగా పిటిషన్లను దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చింది.
9. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా మందుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా బ్లాక్ మార్కెట్‌లో కరోనా మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు.
10. కోవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆధ్వర్యంలో శివసేన యువజన విభాగం ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది.