కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (07-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా వైరస్‌కు గాను చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 9వేల మందిని ఈ ట్రయల్స్‌కు వాలంటీర్లుగా ఎంపిక చేశారు. వ్యాక్సిన్‌కు విజయవంతంగా ఆమోదం లభిస్తే ఆ కంపెనీ ఏటా 10 కోట్ల డోసులను తయారు చేస్తుంది.
2. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి ఉగ్రవాదులకు వరంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. దీన్ని ఆసరగా చేసుకుని ఉగ్రవాదులు ప్రజలపై దాడులు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు.
3. దేశంలో కరోనా కేసుల నమోదు ప్రారంభం అయినప్పటి నుంచి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వీటిని తక్కువ ధరలకే విక్రయించేలా కేంద్రం ఈ వస్తువులను అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది. అయితే ప్రస్తుతం ఇవి ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నందున ఈ వస్తువులను ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించింది. దీంతో వీటి ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
4. రేషన్ కార్డులు లేని హిజ్రాలకు ఉచితం బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీఎం గరీబ్ యోజన కింద వారికి నెలకు ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేయాలని ఆదేశించింది.
5. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ముంబైలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం 15 లక్షల మందికి పైగా ప్రస్తుతం ముంబైలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
6. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవ్యాక్సిన్‌కు గాను హైదరాబాద్ నిమ్స్‌లో మంగళవారం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 1000 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. 14 రోజుల అనంతరం రెండో డోస్ ఇస్తారు.
7. తెలంగాణ గవర్నర్ తమిళిసై మంగళవారం రాష్ట్రంలోని కోవిడ్ చికిత్స అందిస్తున్న 11 ప్రముఖ ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం వస్తే వారిని వెనక్కి పంపకూడదని, వారు నాలుగైదు హాస్పిటళ్లు తిరిగేలా చేయకూడదని అన్నారు. భారీగా ఫీజులను వసూలు చేయవద్దన్నారు. అలాగే కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె సీఎస్ సోమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు.
8. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న టెక్ మహీంద్రా క్యాంపస్‌లో గత వారం రోజుల వ్యవధిలో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో క్యాంపస్‌ను 72 గంటల పాటు సీల్ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
9. కరోనా నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు స్పాన్సర్లు కరువయ్యారు. స్పాన్సర్‌షిప్ కోసం టెండర్లను ఆహ్వానించగా ఏ కంపెనీ ముందుకు రాలేదు. పెప్సీ కంపెనీ ఒక్కటే గతంలో కన్నా 40 శాతం తక్కువ మొత్తానికి టెండర్ వేసింది. దీంతో బిడ్డింగ్ క్యాన్సిల్ చేసి మరోసారి టెండర్లను ఆహ్వానించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
10. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,503కు చేరుకుంది. మొత్తం 20,201 మంది చనిపోయారు. 4,41,868 మంది కోలుకోగా.. 2,61,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి.