కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం బాగా తగ్గిన విషయం విదితమే. మరికొద్ది రోజులు ఆగితే సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలను అందిస్తున్నట్లు చెప్పి ఆ ప్రక్రియను కూడా మొదలు పెట్టింది. అయితే కోవిడ్ మూడో వేవ్‌పైనే ఇప్పుడంతా చర్చ సాగుతోంది.
కోవిడ్ మూడో వేవ్ వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉందని కొందరు అంటుంటే, మెజారిటీ నిపుణులు మాత్రం నవంబర్ వరకు మూడో వేవ్ వస్తుందని చెబుతున్నారు. అయితే మూడో వేవ్ వచ్చేదీ, రానిదీ మనుషుల ప్రవర్తనను బట్టి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ మొదటి వేవ్ ప్రభావం తగ్గి కేసుల సంఖ్య బాగా తగ్గే సరికి అంతా అయిపోయిందని రిలాక్స్ అయ్యారు. జాగ్రత్తలు పాటించలేదు. దీంతో కరోనా మరింత మారి తీవ్రతరం అయి సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుంది కనుక చాలా చోట్ల ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంక్షలను సడలించారు కదా అని జాగ్రత్తగా లేకపోవడం వల్లే రెండో వేవ్ వచ్చింది, ఇప్పుడు మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నారు, ఇక ఇప్పుడు కూడా జాగ్రత్తగా లేకపోతే మూడో వేవ్ రావడం ఖాయం. కనుక మూడో వేవ్ రావాలా, వద్దా అనేది మన ప్రవర్తన మీదే ఆధార పడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ వైరస్ తీవ్రత అంత తగ్గుతుందని, మూడో వేవ్ రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. మరి ప్రజలు ఈసారైనా జాగ్రత్తలను పాటిస్తారా ? మూడో వేవ్‌ను రాకుండా తమను తామే రక్షించుకుంటారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.