కరోనా వైరస్ ఏయే ఉపరితలాలపై ఎన్ని రోజులపాటు, ఎంత సమయం పాటు ఉంటుందో సైంటిస్టులు ఇది వరకే పరీక్షలు చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి చెందిన ఇంకో విషయాన్ని వారు వెల్లడించారు. అదేమిటంటే… కోవిడ్ పేషెంట్లు ఉన్న గదుల్లో వైరస్ కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుందని గుర్తించారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
కోవిడ్ పేషెంట్లను ప్రత్యేకంగా గదుల్లో ఉంచి చికిత్సను అందిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ గదుల్లో ఉండే దుమ్ము, ధూళికి చెందిన శాంపిల్స్‌ను సైంటిస్టులు సేకరించారు. ఆ శాంపిల్స్ ను తరచూ పరిశీలించారు. అలా నెల రోజుల వరకు వారు పరిశోధనలు చేశారు. దీంతో నెల రోజుల తరువాత కూడా కోవిడ్‌కు చెందిన ఆర్ఎన్ఏ ఇంకా ఆ దుమ్ము, ధూళిలో అలాగే ఉందని తెలిపారు. అందువల్ల దుమ్ము, ధూళిలో కరోనా వైరస్ నెల రోజుల పాటు అలాగే ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు తెలియజేశారు.
ఇలా కోవిడ్ దుమ్ము, ధూళిలలో నెలరోజుల పాటు అలాగే ఉండడం ఆందోళన కలిగించే అంశమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే స్కూల్స్, హాస్పిటల్స్, ఇతర ప్రజలు తిరిగే ప్రదేశాల్లో కోవిడ్ పేషెంట్లు ఉంటే అక్కడ దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే దాని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని, బహుశా దీనివల్లే ప్రస్తుతం కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆయా ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని తెలిపారు.