తెలుగుదేశం పార్టీకి తిరుపతి పార్లమెంట్ సీటు ఎప్పుడూ అందని ద్రాక్షగానే మారింది..ఒక్కసారి అలా చేతికి చిక్కినా మళ్ళీ పట్టు బిగించిన దాఖాలు లేవు. పార్లమెంటు సెగ్మెంట్ లోని అసెంబ్లీ స్దానాల్లో పార్టీ గెలుస్తున్న..పార్లమెంటు వచ్చేసరికే పరిస్థితి మారుతుంది దీంతో ఎలాగైనా ఈసారి ఎంపి సీటు కైవసం చేసుకోవాలని పక్క వ్యూహంతో ముందుకెళుతోంది టీడీపీ. వైసీపీ ఆధిపత్యపోరు కూడా తమకు ప్లస్ అవుతుందని లెక్కలేస్తుంది.
తిరుపతి లోక సభ ఉప ఎన్నిక గెలుపు టీడీపీకి ఇప్పుడు ఎంతో అవసరం..వరుసగా ఎదురవుతున్న ఓటములకు ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని..పార్టీ కేడర్ కు కొండంత బలం ఇవ్వాలన్నది టిడిపి అధినేత ఆలోచన. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి 1984లో టీడీపీ విజయం సాధించగలిగింది.1999లో టీడీపీ మద్దతుతో బీజేపీ విజయం సాధించింది. పార్టీ పదే పదే అభ్యర్థులను మారుస్తూ రంగంలో దింపడం కూడా పార్టీ ఓటమికి ఒక కారణంగా పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే పార్లమెంటు సీటు కోల్పోయినా పార్లమెంటు పరిదిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ జెండా చాలాసార్లు ఎగిరింది..తిరుపతి,సత్యవేడులో ఆరుసార్లు,శ్రీకాళహస్తీలో 7 సార్లు విజయం సాధించింది. ఇక నెల్లూరు జిల్లా పరిధిలోని గూడురు,వెంకటగిరిలో నాలుగు సార్లు,సర్వేపల్లి మూడుసార్లు, సూళ్ళూరు పేటలోను 4సార్లు టిడిపి గెలిచింది. అయినా తిరుపతి ఎంపీ సీటు మాత్రం గెలవలేక పొయింది. టీడీపీకి చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్దానాల్లో ఎంపీ సీటుకు మెజారిటీ వస్తున్నా..నెల్లూరు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం రావడం లేదు.
ఈ సారి అభ్యర్ధిని మార్చకుండా గత ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన పనబాకలక్ష్మినే మరోసారి బరిలో దించింది టీడీపీ. ఈసారి నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది టీడీపీ. అక్కడ మాజీ మంత్రులను,సీనియర్ పార్టీ నేతలను రంగంలో దించింది. ఇంటింటి ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు నెల్లూరులో వైసీపీ ఆధిపత్యపోరును తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఇదే అవకాశంగా అత్యధికంగా ఓట్లు రాబట్టేందుకు టీడీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.