మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సీపీఐ నారాయణ వార్నింగ్ : నాలుక కోస్తాం !

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆంధ్ర నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ తరఫున ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.  ఈ నేపథ్యంలో.. తాజాగా  మంత్రి ప్రశాంత్ రెడ్డి పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లంకలో పుట్టినోల్లంతా రాక్షసులే అన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలని మండిపడ్డారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవరివైనా సరే నాలుకలు కోయాల్సిందేనని స్పష్టం చేశారు సిపిఐ నారాయణ.

కృష్ణానది నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుందని చెప్పిన ఆయన.. ఒకరినొకరు తిట్టుకుంటే నీళ్లు రావని.. గోడవలే మిగులుతాయని చురకలు అంటించారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్.. ఆంధ్రా వాళ్ళని తిట్టే ఎత్తుగడ వేస్తాడని ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాల సీఎంలు రాత్రిపూట రహస్యంగా మాట్లాడుకుంటారు.. తప్ప ఇలాంటి నీళ్ల సమస్యల్లో కలిసి పగలు కూర్చుని మాట్లాడుకోరని ఎద్దేవా చేశారు సీపీఐ నారాయణ.