కరోనా ఉన్నప్పటికీ వెస్టిండీస్‌లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20ని నిర్వహించనున్నారు. పూర్తిగా బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహిస్తారు. ఈ ఏడాది సీపీఎల్ టీ20 8వ ఎడిషన్ జరగనుంది. ఇందులో విండీస్‌తోపాటు ఇతర దేశాల నుంచి పలువురు ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. అయితే వాటిల్లో ఒకటైన గయానా అమెజాన్ వారియర్స్ ఇప్పటి వరకు నిర్వహించిన సీపీఎల్ టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ వస్తోంది. అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటి వరకు విజేతగా నిలవలేదు. మొత్తం 7 సార్లు టోర్నీల్లో 5 సార్లు ఆ జట్టు ఫైనల్‌కు చేరినా.. ట్రోఫీని ఎత్తలేకపోయింది. అయినప్పటికీ ఈ టీం ప్రతిసారీ ఫేవరెట్‌గానే టోర్నీలో బరిలోకి దిగుతోంది.
కాగా సీపీఎల్ టీ20లో గయానా అమెజాన్ వారియర్స్ ఇప్పటి వరకు మొత్తం 78 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 50 మ్యాచ్‌లలో విజయం సాధించింది. సీపీఎల్ టీ20లో 2019లో ఈ జట్టు జమైకాపై 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అదే ఈ టోర్నీలో ఇప్పటి వరకు గయానా సాధించిన భారీ స్కోరు. ఇక టోర్నీలో 2016లో జమైకా చేతిలో ఈ టీం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది గయానాకు అత్యల్ప స్కోరు.
గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లలో ఇప్పటి వరకు లెండల్ సిమ్మన్స్ 1029 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జట్టుకు ఆడిన ప్లేయర్లలో 2019 టోర్నీలో బార్బడోస్ జట్టుపై బ్రాండన్ కింగ్ 132 పరుగుల స్కోరు చేయగా.. అదే ఈ జట్టుకు ఒక ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోరుగా నిలిచింది. గయానా జట్టు తరఫున బ్రాండన్ కింగ్, షిమ్రాన్ హిట్‌మైర్‌లు 2 సెంచరీలు సాధించారు.
సీపీఎల్ టీ20 టోర్నీలో గయానా జట్టు తరఫున ఆడి అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా లెండల్ సిమ్మన్స్ రికార్డు సాధించాడు. అతను ఈ జట్టుకు ఆడి మ్యాచ్‌లలో కొట్టిన సిక్స్‌ల సంఖ్య 43. గయానా జట్టు తరఫున 2019లో బ్రాండన్ కింగ్ టోర్నీలో మొత్తం కలిపి అత్యధికంగా 496 పరుగులు సాధించాడు. ఈ జట్టు తరఫున అత్యధిక వికెట్లు (49) తీసిన బౌలర్‌గా సోహెయిల్ తన్వీర్ పేరుగాంచాడు. అయితే వీరే కాదు.. ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ తదితర విభాగాల్లోనూ గయానా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. మరి ఈ సారైనా ఈ జట్టు ట్రోఫీని సాధిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.