ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 4వ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ పై గయానా అమెజాన్ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా గయానా టాస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. సెయింట్ కిట్స్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సెయింట్ కిట్స్ జట్టులో లెవిస్ (18 బంతుల్లో 30 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ పెద్దగా చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. గయానా బౌలర్లలో కేఎంఏ పాల్‌కు 4 వికెట్లు దక్కగా, ఇమ్రాన్ తాహిర్‌కు 2, గ్రీన్‌కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన గయానా 128 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. 17 ఓవర్లలో 7 వికెట్లు 131 పరుగులు చేసింది. ఆ జట్టులో హిట్‌మైర్ (44 బంతుల్లో 71 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. సెయింట్ కిట్స్ బౌలర్లలో ఎమ్రిట్ 3 వికెట్లు పడగొట్టగా కాట్రెల్, డ్రేక్స్ చెరొక వికెట్ తీశారు.