రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతి మీద ఆయన ఫిర్యాదు చేశారు. ఇళ్లపట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్న ఆయన ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్యని అన్నారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరమని, కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. 600 ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారని, ఎకరం రూ45 లక్షల చొప్పున రూ 270 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.
ఈ ముంపు భూములు మెరక చేయడానికి మరో రూ250 కోట్లు ఖర్చుపెట్టారని, అలా ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని అన్నారు. ఇళ్లపట్టాలకు భూసేకరణలో భారీగా డబ్బు చేతులు మారిందని, ఇందులో అధికార పార్టీ నాయకులు భారీగా డబ్బు దండుకున్నారని అన్నారు. ఆవ భూములు, చిత్తడి నేలల సేకరణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమన్న ఆయన భూసేకరణ ధరల్లో కూడా భారీ మాయాజాలం చేశారని అన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అప్పుడే అవినీతి దృష్టాంతాలు అనేకం బైట పడతాయి. సమగ్ర విచారణ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరారు.