ఇదేం పిచ్ బాబూ.. చెన్నై స్టేడియం క్యురేట‌ర్‌పై అభిమానుల ఆగ్ర‌హం..

-

భార‌త్‌, ఇంగ్లండ్ ల మ‌ధ్య చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో శుక్ర‌వారం మొద‌టి టెస్టు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ప్ర‌స్తుతం ఇంకా తొలి ఇన్నింగ్స్‌నే ఆడుతోంది. 8 వికెట్ల న‌ష్టానికి ఆ జ‌ట్టు 545 ప‌రుగుల వ‌ద్ద ఉంది. అయితే చెన్నై స్టేడియం పిచ్ ఇలా డ‌ల్‌గా ఉండ‌డంపై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

cricket fans angry over chennai pitch curator

చెన్నై స్టేడియం పిచ్ స‌హ‌జంగానే స్పిన్న‌ర్‌ల‌కు అనుకూలిస్తుంది. ఇంగ్లండ్ క‌నుక స్పిన్‌ను ఆడ‌డంలో ఇబ్బందులు ప‌డ‌తారు అని అంద‌రూ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌రుగులు చేస్తున్నారు. దీంతో వారి వికెట్లను తీసేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే పిచ్ మ‌రీ డ‌ల్‌గా ఉంద‌ని, తొలి రోజు ప‌క్క‌న పెడితే క‌నీసం రెండో రోజు అయినా పిచ్ బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అలా కూడా జ‌ర‌గ‌లేదు. దీంతో పిచ్ కేవ‌లం బ్యాట్స్‌మెన్‌కు మాత్ర‌మే అనుకూలిస్తుండ‌డంపై అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

చెన్నై స్టేడియం పిచ్ క్యురేట‌ర్ ర‌మేష్ మ్యాచ్ కు ముందు మాట్లాడుతూ.. పిచ్ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఇద్ద‌రికీ స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపాడు. తొలి రెండు రోజులు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించినా త‌రువాత బౌల‌ర్ల‌కు, అందులోనూ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుంద‌న్నాడు. కానీ ప‌రిస్థితి మాత్రం వ్య‌తిరేకంగా క‌నిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ క‌చ్చితంగా డ్రాగా ముగుస్తుంద‌ని అభిమానులు ముందే మ్యాచ్ ఫ‌లితాన్ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పిచ్ క్యురేట‌ర్‌, బీసీసీఐపై వారు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక‌నైనా స్పిన్న‌ర్ల‌కు అనుకూలించేలా పిచ్‌ల‌ను రూపొందించాల‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news