ఏపీలో ఎన్నికల హడావుడి ఒక రేంజ్ లో ఉంది. ఏపీ ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం మధ్య పోటాపోటీగా రచ్చ రేగుతోంది. ఈ అంశం మీద ఎస్ఈసీ నిమ్మగడ్డని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఇబ్బందుల్లో పెట్టేలా వ్యాఖ్యలు చేయొద్దన్న బొప్పరాజు, ఉద్యోగులు, అధికారులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వాన్ని , ఎస్ఈసీని కోరుతున్నామని అన్నారు.
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమే మా ముందున్న కర్తవ్యం అని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగులని ఇబ్బందులకు గురి చేసే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మేం పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తప్పు చేస్తే ఇపుడైనా, ఎపుడైనా ఉద్యోగులను శిక్షించే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అధికారులు, ఉద్యోగులను రెండు పక్షాలు ఇబ్బంది పెట్టొద్దన్న ఆయన ఉద్యోగులు, అధికారులు రేయింబవళ్లు కష్ట పడుతున్నారని అన్నారు. ఇపుడు ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఉద్యోగులు పని చేస్తారని ఆయన తేల్చి చెప్పారు.