జైల్లో ఖైదీ హత్య.. 15 మందికి ఉరిశిక్ష విధించిన కోర్టు

ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌లో ఓ ఖైదీ హత్య కేసుకు సంబంధించి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 15 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక్కడి ఘాఘీడీహ్‌ సెంట్రల్‌ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మనోజ్‌కుమార్‌ సింగ్‌ అనే ఖైదీ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈస్ట్‌ సింగ్భుమ్‌లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి రాజేంద్ర కుమార్‌ సిన్హా గురువారం తీర్పు ఇచ్చారు.

ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 120బి (నేరపూరిత కుట్ర) కింద 15మందికి ఉరిశిక్ష విధించారని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. సెక్షన్‌ 307(హత్యాయత్నం) అభియోగాల కింద మరో ఏడుగురికి పదేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. అయితే, మరణశిక్ష పడిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు ఖైదీలను పట్టుకొని తమ ఎదుట హాజరు పరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఆ దోషుల్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.