రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని బల్మూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి స్కూలు నుంచి మైలారం గుట్ట పైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు సమాచారం.చిన్నారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఆమెని కాపాడారు. వినాయకచవితి వేడుకల సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, నిందితుడిపై ఎలాంటి కేసు నమోదుకాలేదు.అతనికి స్థానికంగా పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఉందని, అందుకే కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతనిపై దొంగతనం కేసు ఉన్నట్లు సమాచారం. మత్తు పదార్థాలకు బానిసై స్థానికంగా ఉన్న యువతను కూడా చెడు వ్యసనాలకు బానిస చేశాడని ఆరోపణలువినిపిస్తున్నాయి. ఇక బాధిత చిన్నారికి తల్లి లేదు. తండ్రి మాత్రమే ఉండగా..అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై తెలిపారు.