దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె కల్తీ అవుతుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఇది మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మసాలాలు, పొడులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. 300 కిలోల కల్తీ మసాలాలు, పొడులను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో అనూప్ వర్ష్‌నే అనే వ్యక్తి ఎలాంటి లైసెన్స్ లేకుండా మసాలాలు, పొడులను తయారు చేసి అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అందుకు గాను అతను అక్కడ ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ మసాలాల్లో కల్తీ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీపై ఆకస్మికంగా దాడులు చేశారు. ఆ దాడుల్లో పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి.
కల్తీ మసాలా పొడులను తయారు చేసేందుకు వారు గాడిద పేడ, గడ్డి, యాసిడ్, ఫుడ్ కలర్స్‌ను వాడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 300 కిలోల మసాలా పొడులను వారు సీజ్ చేశారు. వాటిల్లో కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు ఉన్నాయి. వాటన్నింటిలోనూ కల్తీ జరిగినట్లు ప్రాథమింగా నిర్దారించారు. ఈ క్రమంలో మొత్తం 27 శాంపిళ్లను టెస్టింగ్ నిమిత్తం పంపించారు. వాటిల్లో కల్తీ జరిగిందని రిపోర్టు వస్తే సదరు వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు.
కాగా దేశంలో ఆహారం కల్తీ అనేది పెద్ద సమస్యగా మారింది. ఇటీవలే తేనె కల్తీ జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. అసలు తాము తింటున్నది నకిలీ ఆహార పదార్థాలా, అసలువా.. అని అయోమయానికి లోనవుతున్నారు.