కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో అనేక మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్, టెలిగ్రాం వంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో యూజర్లకు పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తామని, రోజుకు రూ.5వేల వరకు సంపాదించవచ్చని చెబుతూ మెసేజ్‌లు పంపుతున్నారు. కానీ నిజానికి ఆ మెసేజ్‌లన్నీ ఫేక్ అని, యూజర్లు ఆ మెసేజ్‌లలో ఇచ్చిన లింక్‌లను ఓపెన్ చేస్తే వ్యక్తిగత వివరాలతోపాటు ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని దుండగులు చోరీ చేసి బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బును కాజేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో యూజర్లకు ఈ తరహా మెసేజ్ లు ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ రూపంలో వచ్చేవి. కానీ మోసగాళ్లు ప్రస్తుతం తమ పంథా మార్చారు. జనాలు ఎక్కువగా వాట్సాప్ వంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారని తెలుసుకుని ఆ మాధ్యమాల్లో వారికి అలాంటి మెసేజ్ లను పంపిస్తున్నారు. తాము ఇచ్చే లింక్‌లను ఓపెన్ చేసి వాటిల్లో చిన్నపాటి టాస్క్‌లను చేస్తే రోజుకు రూ.5వేల వరకు సంపాదించవచ్చని చెబుతూ యూజర్లకు మెసేజ్ లు పంపిస్తున్నారు. దీంతో సహజంగానే అలాంటి మెసేజ్‌లకు ఆకర్షితులయ్యే జనాలు వాటిని ఓపెన్ చేసి అందులో తమ వివరాలను నమోదు చేస్తున్నారు.
ఇక కొందరైతే ఏకంగా తమ బ్యాంకింగ్ వివరాలనే సదరు లింక్ లలో ఎంటర్ చేస్తున్నారు. దీంతో దుండగులకు జనాల డబ్బులు కొట్టేయడం చాలా సులభతరం అయింది. అలా వివరాలను ఎంటర్ చేశారో లేదో ఇలా వారు డబ్బులను కాజేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరూ కూడా ఊరికే చిన్నపని చేస్తే రూ.5వేలు ఇవ్వరు.. అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు కూడా అలాంటి మెసేజ్ లు వస్తే స్పందించకండి. వాటిని వెంటనే డిలీట్ చేసేయండి.