జగిత్యాలలో దారుణం.. ఇద్దరు పిల్లలను బావిలో తోసి తండ్రి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నర్సింగాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బావిలోని మృతదేహాలు వెలికితీశారు. మృతుల్లో ఓ వ్యక్తి, ఇద్దరు చిన్నారులున్నట్లు గుర్తించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. జలపతిరెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు ప్రణీత(11), మధుమిత(9)ను బావిలోకి తోసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. జలపతిరెడ్డికి కొంతకాలంగా మానసికంగా బాగాలేదని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి వారి ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు