జీవన్‌రెడ్డి హత్యకు నాలుగు నెలల క్రితమే ప్రణాళిక!

-

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రసాద్‌గౌడ్‌(43)ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. సోమవారం నగర దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌తో కలసి దక్షిణ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ భార్య లావణ్య ఆర్మూర్‌ నియోజకవర్గం కల్లెడ గ్రామ సర్పంచి. గ్రామంలో తన సొంత డబ్బుతో రూ.20లక్షల విలువైన పనులుచేసి బిల్లులు పెట్టారు. వీటిలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో సర్పంచి లావణ్యను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. బిల్లులు నిలిచిపోయాయి. ఈ విషయమై ప్రసాద్‌గౌడ్‌ ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డాడు. భార్య పదవి కోల్పోవడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారణమని భావించాడు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు.

ప్రసాద్‌గౌడ్‌ ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి సేకరించాడు. జూన్‌లో కల్లెడ గ్రామానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి సహాయంతో నాంపల్లిలోని ముస్తఫా ఆర్మ్‌ దుకాణంలో ఎయిర్‌ పిస్టల్‌, 30 పెల్లెట్స్‌ కొనుగోలు చేశాడు. అదే రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. జులై 1న ప్రసాద్‌గౌడ్‌కు నిజామాబాద్‌కు చెందిన సుగుణ అనే మహిళ ద్వారా సురేందర్‌ దయావతి పరిచయమయ్యాడు. వీరి ద్వారా బిహార్‌లోని మున్నాకుమార్‌కు రూ.60వేలు చెల్లించి దేశవాళీ తుపాకీ తీసుకున్నాడు. బుల్లెట్లు ఇవ్వకపోవడంతో దమ్మయ్యసాగర్‌ అనే వ్యక్తితో బిహార్‌ వెళ్లి మున్నాకుమార్‌ను కలిశాడు. అక్కడా బుల్లెట్లు దొరక్కపోవటంతో నగరానికి చేరారు.

ఈ నెల 1న రాత్రి కత్తి(డాగర్‌), ఎయిర్‌పిస్టల్‌తో కారులో బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నాడు. అప్పుడే కార్యక్రమాలు పూర్తిచేసుకొని వచ్చిన ఎమ్మెల్యే మూడో అంతస్తుకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది భోజనం చేసేందుకు సెల్లార్‌లోకి వచ్చారు. అధికార పార్టీ నాయకుడు కావటంతో ప్రసాద్‌గౌడ్‌ నేరుగా లిఫ్టు ద్వారా మూడో అంతస్తులోని ఎమ్మెల్యే పడకగదికి చేరుకున్నాడు. ఎమ్మెల్యే కణతకు ఎయిర్‌పిస్టల్‌ను గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. ఉలిక్కిపడిన ఎమ్మెల్యే తేరుకొని కేకలు వేయడంతో పని మనుషులు, భద్రతా సిబ్బంది రావడంతో ప్రసాద్‌గౌడ్‌ పారిపోయాడని డీసీపీ జోయల్‌ డేవిస్‌ వివరించారు.

ఆదివారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అతడి నుంచి కత్తి, ఎయిర్‌పిస్టల్‌, దేశవాళీ తుపాకీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రసాద్‌గౌడ్‌పై వివిధ ఠాణాల్లో 5 కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రసాద్‌గౌడ్‌ను జీవన్‌రెడ్డి తన ఇంటికి పిలిపించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీసీపీ పేర్కొన్నారు. నిందితుడికి సహకరించిన సుగుణ, సురేందర్‌, మున్నూకుమార్‌, సంతోష్‌, దమ్మయ్యసాగర్‌ల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news