- వేయి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- చెన్నైలో ఇద్దరు శ్రీలంక తమిళులను అరెస్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు
చెన్నైః తమిళనాడు కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ను తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) అధికారులు చేధించారు. ఈ డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు తమిళ శ్రీలంక దేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, వేయి కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌సీబీ చెందిన ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.
ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి శ్రీలంక అధికారులు తమతో సమచారం పంచుకున్నారనీ, ఈ నేపథ్యంలో నిఘా ఉంచడంతో గతేడాది నవంబర్‌లో శ్రీలంక నుంచి భారత్‌కు తరలిస్తున్న వందల కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. వీటి విలుల దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనాకు వచ్చిందని ఆయన వివరించారు.
ఈ డ్రగ్స్ రాకెట్ ముఖ్యంగా పాకిస్థాన్, శ్రీలంక కేంద్రాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. వీరి నెట్‌వర్క్ ఆఫ్ఘానిస్థాన్, ఇరాన్, మాల్దీవులు, ఆస్ట్రేలియా వంటి దేశాల వరకూ విస్తరించి ఉందని ఆయన తెలిపారు. డ్రగ్స్ రాకెట్‌తో సంబంధమున్న ఎంఎంఎం. నవాస్, మహ్మద్ అఫానాస్ అనే నిందితులను తాజాగా చెన్నైలో గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.