కొత్త టర్న్ తీసుకున్న జమ్మలమడుగు వైసీపీ పంచాయితీ

-

జమ్మలమడుగు వైసీపీ పంచాయితీ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.కడప జిల్లా జమ్మలమడుగులో ఒకప్పుడు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల మధ్య ఉద్రిక్త రాజకీయాలు నడిచేవి. ఇద్దరూ మాజీ మంత్రులే. మారిన రాజకీయ పరిణామాలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు పంచాయితీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య నడుస్తున్నాయి. వీరిద్దరి మధ్య మరో గ్రూప్‌ ఎంటరవ్వడం అప్పట్లో జరిగింది. ఈ ట్రయాంగిల్‌ ఆధిపత్యపోరు ఇప్పుడు కొత్త టర్న తీసుకుందట.

జమ్మలమడుగు వైసీపీ ట్రయాంగిల్‌ ఆధిపత్యపోరుపై గతంలో పార్టీ పెద్దల దగ్గర పలు పంచాయితీలు జరిగాయి. కానీ ఎప్పటికప్పుడు సమస్యలు సమసినట్టు కనిపించినా అవి తాజాగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకో మలుపు తీసుకోవడం మరింత ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే వైరి వర్గం కొత్త నేతతో జత కలిసిందా అన్న చర్చ నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో సీనియర్లను కాదని.. సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో స్థానిక వైసీపీ నేతలంతా ఆయన గెలపుకోసం కలిసి పనిచేశారు. మొదట్లో కొంచెం అటుఇటుగా ఉన్నా తర్వాత అంతా సర్దుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే.. అసలు కథ ప్రారంభం కావడానికి ఎంతో టైమ్‌ పట్టలేదు. కష్టపడిన పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై గుర్రుగా ఉంది పార్టీలోని ఓ వర్గం. ఇలాంటి వారంతా కలిసి పార్టీలో కొత్త గ్రూప్‌ పెట్టుకున్నారు.

నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఒక వర్గం తయారైంది. ఆ మధ్య ఎమ్మెల్యే సమీప బంధువొకరు వ్యతిరేకవర్గాన్ని చేరదీయడంతో..అది తెలిసిన సుధీర్‌రెడ్డి పోలీసుల సాయంతో వారిని నిర్బంధించారు. దీంతో మరింతగా బుసలు కొడుతోంది స్వపక్షంలోని వైరివర్గం. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో ఎమ్మెల్యేకు మొదటి నుంచి పడటం లేదు. వీరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు పలుమార్లు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేదు. ఇంతలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ వివాహ వేడుకలో రామసుబ్బారెడ్డి చెంతకు చేరింది ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం. ఈ కలయికను చూసినవాళ్లకు ఆశ్చర్యమేస్తే.. జమ్మలమడుగు వైసీపీ రాజకీయం మరో మలుపు తిరుగుతుందా అన్న ఊహాగానాలు నడిచాయి.

రామసుబ్బారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం తమ గోడునంతా వెళ్లబోసుకుందట. ఆయన కూడా అంతా విన్న తర్వాత పార్టీ పెద్దల చెవిలో వేశారట. ఇక్కడి బాగానే ఉన్నా.. వ్యతిరేకవర్గాన్ని బుజ్జగించే బాధ్యత మాజీ మంత్రిపైనే పెట్టారట. దీంతో అధిష్ఠానం ఎత్తుగడ ఏంటా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. రామసుబ్బారెడ్డి ఈ సమస్యను తీరుస్తారా లేక ఇంకో నేత దగ్గరకు ఈ పంచాయితీ వెళ్తుందా అన్నది అర్థం కావడం లేదు. ప్రస్తుతం అందరి దృష్టీ రామసుబ్బారెడ్డిపైనే ఉందట. సమస్య ఎలా తీరుస్తారు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దగ్గరకు సందేశం ఏదైనా పంపుతారా? అలా వచ్చిన సందేశంపై ఎమ్మెల్యే రియాక్షన్‌ ఎలా ఉంటుంది వైరి వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితులు జమ్మలమడుగులో ఉన్నాయా అన్నది ఆసక్తి రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news