సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ఫేక్ న్యూస్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు కొందరు సైబర్ నేరగాళ్లకు అవి అడ్డాగా మారుతున్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని వారు ప్రజలను మోసం చేస్తున్నారు. భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జమ్‌తారా 2.0 పేరిట ఓ భారీ స్కామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతోంది. అయితే ఇంతకీ ఈ స్కామ్ ఏమిటి ? దీని బారి నుంచి సురక్షితంగా ఎలా ఉండాలి ? అన్న వివరాలన ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్‌లో అపరిచిత వ్యక్తులు తమను తాము మహిళలుగా చెబుతూ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి ఫ్రెండ్స్ అవుతారు. తరువాత వీడియో కాల్స్ చేస్తూ అందులో నగ్నంగా కనిపిస్తారు. ఆ సమయంలో బాధితుల ఫొటోలను వీడియో కాల్ ద్వారా తీస్తారు. వాటిని ఆ వీడియో కాల్‌లో కనిపించిన నగ్న దృశ్యాలతో జత చేస్తారు. దీంతో బాధితులు వారితో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా వీడియోలను క్రియేట్ చేసి బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంతో పరువు పోతుందని భావించిన వారు దుండుగులు అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఎత్తున స్కామ్ జరుగుతోంది. కనుక ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఈ తరహా స్కామ్‌లు బాగా పెరిగాయి. గతంలోనూ ఓసారి ఇలాగే జరిగింది. దీంతో అప్పటి జమ్‌తారాకు జమ్‌తారా 2.0గా నామకరణం చేసి ఈ స్కామ్‌ను పిలుస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన భసిన్ అనే వ్యక్తికి ఈవిధంగానే కాల్స్ చేసి తరువాత నగ్న దృశ్యాలు పంపి కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారు. అయితే అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఈ ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు హర్యానా, యూపీ, రాజస్థాన్‌లకు చెందిన మరికొందరితో ఈ విధంగా డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడైంది. దీంతో ఈ ముఠాతో సంబంధం ఉన్న మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కనుక ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ లో మీకు అపరిచిత వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వచ్చినా, కాల్స్ చేసినా స్పందించకండి. లేదంటే చిక్కుల్లో పడిపోతారు.