తాసిల్దార్‌ హత్య దారుణమే… కానీ…!

-

ఆ మండల పరిధిలోని రైతులు ఈ అమానుషం పట్ల పెద్దగా సానుభూతి వ్యక్తం చేయలేదు. మాట్లాడటానికి కూడా ఇష్టపడటంలేదు. ఒకరిద్దరు మాత్రం ‘అలా జరగాల్సిందికాదు. కానీ ఏం చేస్తం.?’ అని గుంభనంగా వ్యవహరించారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసిల్దార్‌ విజయారెడ్డి దారుణ దహనం రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పట్టపగలు పెట్రోలు పోసి తగులబెట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కారణాలేవైనా, చంపడమనేది పరమ నీచమైన చర్య. ఎవరి మీద, ఎవరికి ఎంత కోపమున్నా, ఆమానవీయ ఘటనకు పాల్పడటం దారుణం. క్షణికావేశంలో ఇద్దరు చంటిపిల్లలకు తల్లిని దూరం చేయడం క్షమించరాని నేరం.

కానీ… ఈ దుస్సంఘన తర్వాతి పరిణామాలు మాత్రం విచిత్రంగా పరిణమిస్తున్నాయి. వీఆర్వోలు, డిటిలు, తాసిల్దార్ల పట్ల భూయజమానులు, రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల లంచావతారాలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. ఎంతోమంది బీదరైతులు తమ భూమి వేరొకరి పాలవడంతో తనువు చాలించిన దుష్టాంతాలను ఉదహరిస్తున్నారు. ‘ఈ సంఘటన అమానుషమే. కాదనను. కానీ, వందలాది మంది రైతులు రెవెన్యూ ఉద్యోగుల పాపాల వల్ల ప్రాణాలు తీసుకున్నారు. అప్పుడు ఎవరూ ఎందుకు స్పందించలేదు. అది అమానుషం కాదా..?’ అని అదే అబ్దుల్లాపూర్‌ మండలాఫీసు చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్న ఒక రైతు ప్రశ్నించాడు.

‘అంతెందుకు? ఈ సంఘటన జరిగిన రోజే, ఒక తల్లి తన ముగ్గరు పిల్లలతో సహా నల్లగొండ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. తన మూడున్నర ఎకరాల పట్టాభూమిని భర్త మరణానంతరం వీఆర్వో వేరేవారికి పట్టా చేసాడని, ఎన్నిసార్లు తాసిల్దారుతో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, అందుకే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని ఇంచార్జి కలెక్టర్‌తో చెప్పింది. ఈ రెండు ఘటనల తాలూకు వివరాలు మర్నాటి పేపర్లరో వచ్చాయి. కానీ, తాసిల్దారు హత్య సంఘటనంత ప్రాముఖ్యాన్ని ఈ ఆత్మహత్యాప్రయత్నం సంపాదించుకోలేకపోయింది.  ఒక ప్రముఖ దినపత్రిక రెవెన్యూ తప్పులపై గత కొన్ని నెలలపాటు నడిపించిన శీర్షికకు వేలాదిగా కంప్లయింట్లు వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గత రెండు రోజులుగా విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వారివారి కార్యాలయాలముందు ధర్నాలు చేసారు. తమకు పోలీసు రక్షణ కావాలనీ, పాత ప్రదేశాలకు ట్రాన్స్‌ఫర్‌ కావాలని, విఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని, తమపై వ్యతిరేక ప్రచారాన్ని కట్టడి చేయాలని.. ఇలా డిమాండ్లు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ ముందుంచారు. అన్నట్లు ఈ ధర్నాల సమయంలోనే ఓ బాధితదంపతులు వారిని తమ కేసు విషయంలో నిలదీసారు. లంచం తీసుకుని కూడా పనిచేయట్లేదని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయండం కొసమెరుపు. ఈ విడియో సోషల్‌మీడియాలో విపరీతంగా తిరుగుతోంది.దారుణహత్యకు గురైన తాసిల్దారు విజయారెడ్డిపై కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌ గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఉన్న అత్యంత విలాసవంతమైన భవనం ఆమె నివాసమని, ఈ ఇంటి ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఇది ఈ ఒక్కచోటే ఉన్న సమస్య కాదు. చాలా రాష్ట్రాల్లో రగులుతోంది. ఏపీలో కూడా రైతుల నిరసనలు, బెదిరింపులు మొదలయ్యాయి. ఏ గ్రామంలో కూడా ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ పట్ల సానుకూల దృష్టి లేదు. పాత పాసుపుస్తకాలో ఉన్న అనుభవదారు కాలమ్‌ను అడ్డంపెట్టుకుని దశాబ్దాలుగా పట్టాదారులను మోసం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన ‘భూప్రక్షాళన’ కార్యక్రమం పేరు మీద, అనీ బాగానేఉన్న రికార్డులను కూడా తారుమారు చేసి, తిరిగి బాగుచేయడానికి వేలకువేలు లంచారు గుంజినట్లు పలు ఆరోపణలున్నాయి. కేవలం ఆ రెండు మూడు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ దాదాపు రూ. 470 కోట్ల మేర లంచాలు వసూలు చేసినట్లు ఓ ప్రయివేటు సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది.

రెవెన్యూ శాఖలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ఈ భయంకరమైన అవినీతిని పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కొత్త పాస్‌బుక్‌లు జారీ చేసి, అనుభవదారు కాలమ్‌ను ఎత్తివేయించారు. సమగ్రమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించారు. ఇది ఎంతో స్వాగతించదగ్గ పరిణామం. మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయం.

రైతుకు తన పెళ్లాంపిల్లలకంటే తనకున్న కొద్దిపాటి భూమే సర్వస్వం. దానికి ఏ కొంచెం హాని జరుగుతుందన్నా, తనను దాన్నుంచి విడదీస్తున్నారని తెలిసినా తట్టుకోలేడు. అది అతడి ప్రాణం. ఆ ప్రాణాన్ని లాగేసుకుంటే అతడు పడే క్షోభ వర్ణనాతీతం. అందుకే భూమి కోసం, భుక్తి కోసం ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే, బాధ్యతగా వ్యవహరిస్తే, ఈ దుర్గతులు ఎప్పటికీ పట్టవు. రైతు సంతోషంగా ఉంటే, దేశమే సంతోషంగా ఉంటుంది.

 

  • రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news